19
ఇశ్రాయేలు అధిపతుల గురించి విలాప గీతం 
 
1 “నీవు ఇశ్రాయేలీయుల అధిపతుల గురించి విలాప గీతం పాడి ఇలా చెప్పు:   
2 “ ‘నీ తల్లి ఎలాంటిది అంటే  
సింహాల మధ్యలో ఆడసింహం లాంటిది.  
కొదమ సింహాల మధ్య పడుకుని  
తన పిల్లలను పెంచింది.   
3 ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు  
అది బలమైన సింహం అయ్యింది.  
అది వేటాడడం నేర్చుకొని  
మనుష్యులను తినే జంతువుగా మారింది.   
4 దాని గురించి ఇతర జనాంగాలు విని  
తమ గోతిలో దానిని పట్టుకున్నారు.  
దానికి గాలం తగిలించి  
ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు.   
   
 
5 “ ‘అది చూసిన దాని తల్లి  
తన ఆశ నిరాశ అయ్యిందని  
తన పిల్లల్లో మరో దానిని తీసుకుని  
బలమైన సింహంగా తయారుచేసింది.   
6 ఇది కూడా కొదమ సింహమై,  
మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూ  
వేటాడడం నేర్చుకొని  
మనుష్యులను తినే జంతువుగా మారింది.   
7 అది వారి బలమైన కోటలను పడగొట్టి  
వారి పట్టణాలను పాడుచేసింది.  
దాని గర్జన విని  
దేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది.   
8 నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూ  
దానిని పట్టుకోవడానికి వచ్చి  
దాని కోసం తమ వలలు పన్ని  
తమ గోతిలో దానిని చిక్కించుకున్నారు.   
9 దానికి గాలం తగిలించి బోనులో పెట్టి  
బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు.  
ఇశ్రాయేలీయుల పర్వతాలమీద  
దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా  
వారు దానిని చెరసాలలో ఉంచారు.   
   
 
10 “ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కన  
నాటబడిన ద్రాక్షవల్లిలాంటిది;  
నీరు సమృద్ధిగా ఉన్నందున  
అది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది.   
11 పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన  
బలమైన కొమ్మలు దానికున్నాయి.  
అది మేఘాలను తాకే అంతగా  
పైకి పెరిగింది  
దానికున్న అనేక కొమ్మలతో  
ఏపుగా పెరిగింది.   
12 అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి  
నేల మీద పారవేయబడింది.  
తూర్పు గాలి వీచగా  
దాని పండ్లు వాడిపోయాయి;  
బలమైన దాని కొమ్మలు  
అగ్నిలో పడి కాలిపోయాయి.   
13 ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిన  
నీళ్లు లేని ఎడారిలో నాటబడింది.   
14 దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి  
దాని పండ్లను కాల్చివేసింది.  
పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన  
బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’  
ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”