18
పాపం చేసేవాడు చనిపోతాడు 
 
1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:  
2 “ఇశ్రాయేలు దేశం గురించి మీరు చెప్పే ఈ సామెతకు అర్థం ఏంటి?  
“ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తింటే  
పిల్లల పళ్లు పులిసాయి.’   
3 “నా జీవం తోడు, ఇశ్రాయేలీయుల మధ్య ఈ సామెత మళ్ళీ వినపడదు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.  
4 ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా వారే, తండ్రులైనా పిల్లలైనా ఇద్దరూ నా వారే. పాపం చేసేవాడు చనిపోతాడు.   
5 “ఒక నీతిమంతుడు ఉంటే  
అతడు నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు.   
6 అతడు పర్వత క్షేత్రాల మీద భోజనం చేయడు,  
ఇశ్రాయేలీయుల విగ్రహాలవైపు చూడడు,  
తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు,  
బహిష్టులో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవడు,   
7 ఎవరిని బాధించడు,  
అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు,  
ఎవరినీ దోచుకోడు  
కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి  
దిగంబరికి బట్టలు ఇస్తాడు.   
8 వడ్డీకి అప్పు ఇవ్వడు  
వారి నుండి లాభం తీసుకోడు.  
తప్పు చేయకుండా జాగ్రత్తపడతాడు  
సత్యంగా న్యాయం తీరుస్తాడు.   
9 అతడు నా శాసనాలను అనుసరించి  
నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు.  
ఇలాంటి వాడే నీతిమంతుడు;  
అతడు నిజంగా బ్రతుకుతాడు,  
అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.   
10 “ఒకవేళ అతనికి ఈ మంచి పనులేవి చేయకుండా రక్తం చిందించే ఒక హింసాత్మకుడైన కుమారుడు ఉంటే,  
11 అతడు తన తండ్రి చేయని వీటన్నిటిని చేసేవాడైతే:  
“అతడు పర్వత క్షేత్రాల దగ్గర తింటాడు.  
తన పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తాడు.   
12 పేదవారిని దరిద్రులను అణచివేస్తాడు.  
దోపిడీలు చేస్తాడు.  
అప్పుకు తాకట్టుగా తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడు.  
అతడు విగ్రహాలవైపు చూస్తాడు.  
అసహ్యమైన పనులు చేస్తాడు.   
13 అతడు వడ్డీలకు అప్పు ఇచ్చి లాభం తీసుకుంటాడు.  
అలాంటివాడు బ్రతుకుతాడా? అతడు బ్రతకడు! ఎందుకంటే అతడు ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు కాబట్టి, అతనికి మరణశిక్ష విధించబడుతుంది; తన మరణానికి అతడే బాధ్యుడు.   
14 “అయితే అలాంటి వానికి పుట్టిన కుమారుడు తన తండ్రి చేసిన పాపాలన్నిటిని చూసి ఆలోచించి అలాంటి పనులు చేయకపోతే అంటే:   
15 “అతడు పర్వత క్షేత్రాల దగ్గర తినడు  
ఇశ్రాయేలీయుల విగ్రహాలను చూడడు.  
తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు.   
16 అతడు ఎవరినీ అణచివేయడు,  
ఎవరి వస్తువులు తాకట్టు ఉంచుకోడు.  
అతడు ఎవరినీ దోచుకోడు  
కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇస్తాడు,  
దిగంబరికి బట్టలు ఇస్తాడు.   
17 అతడు పేదల పట్ల తప్పుగా ప్రవర్తించడు,  
వారి నుండి వడ్డీని గాని లాభాన్ని గాని తీసుకోడు.  
అతడు నా చట్టాలను అనుసరించి నా శాసనాలను పాటిస్తాడు.  
అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా మరణించడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు.  
18 కాని అతని తండ్రి క్రూరుడై ఇతరులను బాధపెట్టి తన సోదరులను దోచుకుని తన ప్రజలమధ్య చేయకూడని తప్పు చేశాడు కాబట్టి అతడు తన పాపం కారణంగా చనిపోతాడు.   
19 “అయితే మీరు, ‘తన తండ్రి దోషశిక్షను కుమారుడు ఎందుకు భరించడు?’ అని అడుగుతున్నారు. కుమారుడు నీతిన్యాయాలను జరిగిస్తూ నా శాసనాలను అనుసరించి నా నిబంధనలను పాటించాడు. కాబట్టి అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు.  
20 పాపం చేసేవాడు చనిపోతాడు. తల్లిదండ్రుల పాపాన్ని పిల్లలు భరించరు. పిల్లల పాపాన్ని తల్లిదండ్రులు భరించరు. నీతిమంతుని నీతి వానికే చెందుతుంది. అలాగే దుర్మార్గుని దుర్మార్గం వానికే చెందుతుంది.   
21 “అయితే దుర్మార్గులు తాము చేసిన పాపాలను విడిచిపెట్టి నా శాసనాలను అనుసరించి న్యాయమైనవి, సరియైనవి చేస్తే వారు చనిపోరు; ఖచ్చితంగా బ్రతుకుతారు.  
22 వారు చేసిన నేరాల్లో ఏది జ్ఞాపకం చేసుకోబడదు. వారి నీతి క్రియలను బట్టే వారు బ్రతుకుతారు.  
23 దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతికితేనే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.   
24 “అయితే నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తూ దుర్మార్గునిలా అసహ్యమైన పనులు చేస్తే వారు బ్రతుకుతారా? వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు. వారు నమ్మకద్రోహంతో చేసిన దోషాలను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి వారు చస్తారు.   
25 “అయినా మీరు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. ఇశ్రాయేలీయులారా! నా మాట వినండి. నా మార్గం అన్యాయమైనదా? మీ మార్గాలు అన్యాయమైనవి కావా?  
26 నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే వారు దానిని బట్టి చస్తారు. వారు చేసిన పాపాన్ని బట్టి వారు చస్తారు.  
27 అయితే దుర్మార్గులు తాము చేసిన దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.  
28 అతడు తాను చేసిన నేరాలన్నిటిని గమనించుకుని వాటిని చేయడం మానేశాడు కాబట్టి అతడు చనిపోడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు.  
29 అయినా ఇశ్రాయేలీయులు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. ఇశ్రాయేలీయులారా! నా మార్గాలు అన్యాయమైనవా? కాని మీ మార్గాలే కదా అన్యాయమైనవి?   
30 “ఇశ్రాయేలు ప్రజలారా! ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. పశ్చాత్తాపపడి మీ అక్రమాల కారణంగా మీరు శిక్షించబడకుండా వాటిని విడిచిపెట్టండి.  
31 గతంలో మీరు చేసిన నేరాలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందండి. ఇశ్రాయేలీయులారా! మీరెందుకు మరణాన్ని పొందాలి?  
32 మరణించిన వానిని బట్టి నేను సంతోషించను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పశ్చాత్తాపపడి జీవించండి!