కీర్తన 86
ఒక దావీదు ప్రార్థన. 
 
1 యెహోవా, చెవియొగ్గి ఆలకించండి, నాకు జవాబివ్వండి,  
ఎందుకంటే నేను దీనుడను నిరుపేదను.   
2 మీపట్ల విశ్వాసంగా ఉన్న నా ప్రాణాన్ని కాపాడండి;  
మీయందు నమ్మకం ఉంచిన సేవకుడిని రక్షించండి. మీరే నా దేవుడు;   
3 ప్రభువా! నాపై దయచూపండి.  
దినమంతా నేను మీకు మొరపెడుతున్నాను.   
4 ప్రభువా, మీ సేవకునికి ఆనందం ప్రసాదించండి,  
ఎందుకంటే నేను మీయందు నమ్మకం ఉంచాను.   
   
 
5 ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు,  
మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు.   
6 యెహోవా, నా ప్రార్థన వినండి;  
నా మనవుల ధ్వని ఆలకించండి.   
7 నేను బాధలో ఉన్నప్పుడు మీకు మొరపెడతాను,  
మీరు నాకు జవాబిస్తారు.   
   
 
8 ప్రభువా, దేవుళ్ళలో మీవంటి వారు లేరు;  
మీ క్రియలకు ఏది సాటిలేదు.   
9 ప్రభువా, మీరు సృజించిన దేశాలన్నీ వచ్చి  
మీ ముందు ఆరాధిస్తారు;  
వారు మీ నామానికి కీర్తి తెస్తారు.   
10 మీరు గొప్ప దేవుడు. మీ అద్భుతాలు గొప్పవి;  
మీరే ఏకైక దేవుడు.   
   
 
11 యెహోవా, మీ సత్యాన్ని అనుసరించి జీవించేలా,  
మీ మార్గాలు మాకు బోధించండి,  
నేను మీ నామానికి భయపడేలా  
నా హృదయానికి ఏకాగ్రత దయచేయండి.   
12 ప్రభువా నా దేవా, నా పూర్ణహృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను;  
నేను మీ నామాన్ని నిరంతరం మహిమపరుస్తాను.   
13 ఎందుకంటే నా పట్ల మీ మారని ప్రేమ ఎంతో గొప్పది;  
అగాధాల్లో నుండి,  
పాతాళంలో నుండి మీరు నన్ను విడిపించారు.   
   
 
14 ఓ దేవా, గర్విష్ఠులైన శత్రువులు నాపై దాడి చేస్తున్నారు;  
క్రూరులైన ప్రజలు నన్ను చంపాలని గుమికూడుతున్నారు  
వారు మిమ్మల్ని లక్ష్యపెట్టరు.   
15 కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు,  
త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.   
16 నా వైపు తిరగండి నా మీద కరుణ చూపండి;  
మీ సేవకునికి మీ బలాన్ని ప్రసాదించండి;  
నన్ను రక్షించండి, ఎందుకంటే  
నేను మీ దాసురాలి కుమారుడను.   
17 నాకు మీ ఆదరణ గుర్తు ఇవ్వండి,  
నన్ను ద్వేషించేవారు అది చూసి సిగ్గుపడతారు,  
ఎందుకంటే యెహోవా, మీరు నాకు సహాయం చేశారు నన్ను ఆదరించారు.