కీర్తన 50
ఆసాపు కీర్తన. 
 
1 దేవుడైన యెహోవా, బలాఢ్యుడు,  
భూమితో మాట్లాడతారు,  
సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు వారందరిని పిలుస్తారు.   
2 సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి,  
దేవుడు ప్రకాశిస్తారు.   
3 మన దేవుడు వస్తారు  
మౌనంగా ఉండరు;  
ఆయన ముందు మ్రింగివేసే అగ్ని ఉంది  
ఆయన చుట్టూ బలమైన తుఫాను చెలరేగుతుంది.   
4 తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి  
పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.   
5 “బలి అర్పణల వల్ల నాతో నిబంధన చేసుకున్న  
భక్తులను నా ఎదుట సమావేశపరచండి.”   
6 ఆకాశాలు దేవుని నీతిని ప్రకటిస్తాయి,  
ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. 
సెలా
   
   
 
7 “నా ప్రజలారా! వినండి. నేను మాట్లాడతాను;  
ఇశ్రాయేలు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాను:  
నేను దేవుడను, మీ దేవుడను.   
8 మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి,  
నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను.   
9 మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు.  
మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు.   
10 అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే  
వేయి కొండలపై ఉన్న పశువులు నావే.   
11 పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు,  
పొలాల్లో ఉన్న జంతువులు నావే.   
12 నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను,  
లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి.   
13 ఎడ్ల మాంసం నేను తింటానా?  
మేకపోతుల రక్తం త్రాగుతానా?   
   
 
14 “దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి  
మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి.   
15 ఆపద్దినాన నన్ను పిలువండి;  
నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”   
16 దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు:  
“నా న్యాయవిధులు ఉచ్చరించే  
నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది?   
17 నా సూచనను మీరు అసహ్యించుకుంటారు,  
నా మాటల్ని మీ వెనుకకు పారవేస్తారు.   
18 మీరు ఒక దొంగను చూస్తే, వాడితో కలిసిపోతారు;  
మీ భాగాన్ని వ్యభిచారులతో పంచుకొంటారు.   
19 మీ నోటిని చెడుకు వాడుతారు  
మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు.   
20 మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు,  
మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు.   
21 మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను,  
నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు.  
కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను,  
నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.   
   
 
22 “దేవున్ని మరచే మీరు, కొంచెం ఆలోచించండి,  
లేకపోతే మిమ్మల్ని ఎవరు విడిపించలేనంతగా చీల్చి ముక్కలు చేస్తాను:   
23 కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు,  
నిందారహితులకు దేవుని రక్షణ చూపిస్తాను.”