కీర్తన 43
1 నా దేవా, నాకు న్యాయం తీర్చండి,  
భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా  
నా పక్షంగా వాదించి,  
మోసగాళ్ల నుండి దుష్టుల నుండి  
నన్ను విడిపించండి.   
2 మీరే దేవుడు, నా బలమైన కోట.  
నన్నెందుకు ఇలా తిరస్కరించారు?  
శత్రువులచేత అణచివేయబడుతూ  
నేనెందుకు దుఃఖంతో గడపాలి?   
3 మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి;  
అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి  
మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.   
4 అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను,  
నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను.  
దేవా! నా దేవా!  
వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.   
   
 
5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?  
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?  
దేవుని మీద నిరీక్షణ ఉంచు,  
ఆయనే నా రక్షకుడు నా దేవుడు  
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.