కీర్తన 16
దావీదు శ్రేష్ఠమైన కీర్తన. 
 
1 నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను,  
నన్ను కాపాడండి.   
   
 
2 యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు;  
మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.   
3 భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను,  
“వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”   
4 వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి.  
వారి రక్తార్పణలలో నేను పాల్గొనను  
నా పెదవులతో వారి పేర్లు కూడా పలకను.   
   
 
5 యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర.  
మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.   
6 మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి;  
ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది.   
7 నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను,  
రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది.   
8 ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను.  
ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.   
   
 
9 కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది;  
నా శరీరం కూడా క్షేమంగా విశ్రమిస్తుంది.   
10 ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు,  
మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.   
11 మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు;  
మీ సన్నిధిలోని ఆనందంతో  
మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.