8
రాజు కోసం ఇశ్రాయేలు ప్రజల కోరిక
1 సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులుగా నియమించాడు.
2 అతని పెద్ద కొడుకు పేరు యోవేలు. రెండవవాడి పేరు అబీయా,
3 వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు.
4 ఇశ్రాయేలు పెద్దలంతా కలసి రమాలో ఉన్న సమూయేలు దగ్గరకి వచ్చి,
5 “అయ్యా, విను. నువ్వు ముసలివాడివి. నీ కొడుకులు నీలాగా మంచి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి ప్రజలందరి కోరికను మన్నించి మాకు ఒక రాజును నియమించు. అతడు మాకు న్యాయం తీరుస్తాడు” అని అతనితో అన్నారు.
6 “మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు.
7 యెహోవా సమూయేలుకు ఇలా బదులిచ్చాడు. “ప్రజలు నిన్ను కోరినట్టు జరిగించు. వారు తిరస్కరించింది నిన్ను కాదు. తమను పాలించకుండా నన్నే తిరస్కరించారు.
8 వారు నన్ను తిరస్కరించి, ఇతర దేవుళ్ళను పూజించి, నేను ఐగుప్తునుండి వారిని రప్పించినప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేస్తూ వస్తున్న పనుల ప్రకారమే వారు నీ పట్ల కూడా జరిగిస్తున్నారు. వారు కోరినట్టు జరిగించు.
9 అయితే వారికి రాబోయే కొత్త రాజు ఎలా పరిపాలిస్తాడో దానికి నువ్వే సాక్ష్యంగా ఉండి వారికి స్పష్టంగా తెలియజెయ్యి.”
10 తమకు రాజు కావాలని కోరిన ప్రజలకి సమూయేలు యెహోవా చెప్పిన మాటలన్నీ వినిపిస్తూ
11 ఇలా చెప్పాడు. “మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలా ఉంటాడంటే, అతడు మీ కొడుకులను పట్టుకుని, తన రథాలు నడపడానికి, గుర్రాలను చూసుకోవడానికి వారిని పనికి పెట్టుకుంటాడు. కొందరు అతని రథాల ముందు పరుగెత్తుతారు.
12 అతడు కొందరిని తన సైన్యంలోని వెయ్యిమంది పై అధికారులుగా, యాభైమంది పై అధికారులుగా నియమిస్తాడు. తన పొలాలు దున్నడానికి, పంటలు కోయడానికి, యుద్ధం చేసే ఆయుధాలు, రథాల సామానులు తయారుచేయడానికి వారిని పెట్టుకుంటాడు.
13 మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకొంటాడు.
14 మీ పొలాల్లో, ద్రాక్షతోటల్లో, ఒలీవ తోటల్లో శ్రేష్ఠ భాగాన్ని తీసుకు తన సేవకులకు ఇస్తాడు.
15 మీ పంటలో, ద్రాక్షపళ్ళలో పదవ వంతు తీసుకు తన సిబ్బందికి, పనివారికి ఇస్తాడు.
16 మీ స్వంత పనివాళ్ళలో, పనికత్తెల్లో, మీ పశువుల్లో, గాడిదల్లో మంచివాటిని తీసుకు తన కోసం ఉంచుకొంటాడు.
17 మీ మందల్లో పదవ భాగం తీసుకొంటాడు. మీకు మీరుగా అతనికి దాసులైపోతారు.
18 ఇక ఆ రోజుల్లో మీకోసం మీరు కోరుకొన్న రాజు గురించి ఎంతగా వేడుకొన్నా యెహోవా మీ మనవి పట్టించుకోడు.”
19 ఇలా చెప్పినప్పటికీ, ప్రజలు సమూయేలు మాట పెడచెవిన పెట్టి,
20 “అలా కాదు, ఇతర దేశ ప్రజలు చేస్తున్నట్లు మేము కూడా చేసేలా మాకూ రాజు కావాలి, ఆ రాజు మాకు న్యాయం జరిగిస్తాడు, మాకు ముందుగా ఉండి అతడే యుద్ధాలు జరిగిస్తాడు” అన్నారు.
21 సమూయేలు ప్రజలు పలికిన మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిలో వివరించాడు.
22 అప్పుడు యెహోవా “నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు” అని సమూయేలుకు చెప్పినప్పుడు, సమూయేలు “మీరందరూ మీ మీ గ్రామాలకు వెళ్ళి పొండి” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.