110
దావీదు కీర్తన
1 యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో.
2 యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.
3 నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది.
4 మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.
5 ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు.
6 అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు.
7 దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.