మీకా
గ్రంథకర్త
మీకా గ్రంథ రచయిత మీకా ప్రవక్త (1:1). ఇతడు పల్లెటూరి వాడు. నగరానికి వెళ్ళి ఆ ప్రజల సామాజిక ఆధ్యాత్మిక అన్యాయాలు, విగ్రహ పూజలు మూలంగా వారి మీదకి ముంచుకు రానున్న తీర్పును గురించి దైవ సందేశాన్ని ప్రకటించాడు. దేశంలో వ్యవసాయ ప్రధానమైన ప్రాంతంలో ఇతడు నివసించాడు. దేశంలోని ప్రభుత్వ కేంద్రాలకు దూరాన ఇతని నివాసం. ఆ విధంగా తన జాతిలో అణగారిపోయిన నిర్భాగ్యుల విషయం ఇతడు చింతించాడు. అంగవైకల్యం గలవారు, వెలివేతకు గురైన వారు, బాధితులు మొదలైన వారి పక్షం వహించాడు (4:6). పాతనిబంధనలో కెల్లా యేసు పుట్టుక గురించిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రవచనం మీకాలో ఉంది. ఆయన పుట్టుకకు 700 సంవత్సరాలకు ముందే ఆయన పుట్టబోయే ఊరు, ఆయన నిత్యత్వం గురించి మీకా ప్రవచించాడు (5:2).
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 735 - 700
మీకా మొదటి ప్రవచనాలు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యపతనానికి కొద్దిగా ముందు వచ్చాయి (1:2-7). ఇతర ప్రవచనాలు బబులోను చెర కాలంలో, మరికొన్ని ప్రవాసులు స్వదేశం తిరిగి వచ్చాక రాయడం జరిగింది.
స్వీకర్త
ఉత్తర ఇశ్రాయేల్ ప్రజలకు, దక్షిణ యూదా ప్రజలకు కూడా మీకా రాశాడు.
ప్రయోజనం
మీకా ప్రవచనాలు రెండు ప్రాముఖ్యమైన భవిషత్తు వాక్కులు చుట్టు కేంద్రీకృతం అయినాయి. ఒకటి ఇశ్రాయేల్, యూదాలపై తీర్పు (1:1-3:12). రెండవది వెయ్యేళ్ళ పాలనలో దేవుని ప్రజల ప్రాభవం (4:1-5:16). తన ప్రజల పక్షంగా దేవుడు తాను చేసిన ఉపకారాలను వారికి గుర్తు చేస్తున్నాడు. వారు తమ సంగతి తాము చూసుకుంటే తాను వారి కోసం ఎలా శ్రద్ధ చూపాడో చెబుతున్నడు.
ముఖ్యాంశం
దైవ తీర్పు.
విభాగాలు
1. ముంచుకు వస్తున్న దైవ తీర్పు — 1:1-2:13
2. వినాశనం గురించి సందేశం — 3:1-5:15
3. ప్రజల దోషాన్ని రుజువు చేసే సందేశం — 6:1-7:10
4. ఉపసంహారం — 7:11-20
1
యెరూషలేము, సమరయ
యోతాము ఆహాజు హిజ్కియా అనే యూదా రాజుల రోజుల్లో సమరయ గురించి యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం.
ప్రజలారా, మీరంతా వినండి.
భూమీ, నువ్వూ నీలో ఉన్నదంతా వినాలి.
యెహోవా ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు.
పరిశుద్ధాలయంలోనుంచి ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు.
చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు.
ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు.
ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి.
నిప్పుకు కరిగిపోయే మైనంలా,
వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి.
ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే.
ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం.
యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి?
అది సమరయ కాదా?
యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి?
అది యెరూషలేము కాదా?
నేను సమరయను పొలం లోని రాళ్లకుప్పలాగా చేస్తాను.
ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను.
దాని రాళ్ళు లోయలో పారబోస్తాను,
దాని పునాదులు కనబడేలా చేస్తాను.
దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి.
దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి.
దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను.
అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది,
కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్ళీ వెళ్ళిపోతాయి.
ప్రవక్త విలాపం
ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను.
చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను.
నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను.
దాని గాయాలు మానవు.
అవి యూదాకు తగిలాయి.
నా ప్రజల గుమ్మం వరకూ, యెరూషలేము వరకూ అవి వచ్చాయి.
10 ఈ సంగతి గాతులో చెప్పవద్దు.
అక్కడ ఏమాత్రం ఏడవద్దు.
బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను.
11 షాఫీరు పురవాసులారా,
నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి.
జయనాను పురవాసులారా, బయటకు రావద్దు.
బేత్ ఎజేల్ దుఖిస్తోంది.
వారి భద్రత తొలిగి పోయింది.
12 మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు.
యెహోవా విపత్తు కలిగించాడు.
అది యెరూషలేము గుమ్మాల వరకూ వచ్చింది.
13 లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి.
ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి.
నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం.
14 మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు.
అక్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది.
15 మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను.
ఇశ్రాయేలీయుల నాయకులు* అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు.
16 నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో.
నీ వెంట్రుకలు కత్తిరించుకో.
రాబందులాగా బోడిగా ఉండు.
నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.
* 1:15 నాయకులు మహిమ