20
పాపాలకు శిక్షలు
1 యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు.
2 ఇశ్రాయేలీయుల్లో గానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశుల్లోగాని ఎవరైనా తన పిల్లలను మోలెకు దేవుడికి ఇస్తే వాడికి తప్పకుండా మరణ శిక్ష విధించాలి. ప్రజలు వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి.
3 అతడు తన సంతానాన్ని మోలెకుకు ఇచ్చి నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచి నా పవిత్ర నామాన్ని కలుషితం చేశాడు గనక నేను అతనికి శత్రువునై ప్రజల్లో అతడు లేకుండా చేస్తాను.
4 ఆ వ్యక్తి తన సంతానాన్ని మోలెకుకు ఇస్తుండగా మీ దేశ ప్రజలు చూసి కూడా కళ్ళు మూసుకుంటే, వాణ్ణి చంపక పొతే
5 అప్పుడు నేనే వాడికి, వాడి వంశానికి విరోధినై వాణ్ణి ప్రజల్లో లేకుండా చేస్తాను. మోలెకుతో వేశ్యరికం చెయ్యడానికి వాడి వెంటబడి వ్యభిచారం చేసే వారందరినీ ప్రజల్లో లేకుండా చేస్తాను.
6 చచ్చిన వారితో మాట్లాడుతామని చెప్పేవారితో సోదె చెప్పే వారితో వేశ్యరికం చెయ్యడానికి వారివైపు తిరిగే వారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను.
7 కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్టించుకుని పవిత్రంగా ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను.
8 మీరు నా శాసనాలను పాటించి వాటి ప్రకారం చెయ్యాలి. నేను మిమ్మల్ని పవిత్ర పరచే యెహోవాను.
9 ఎవడు తన తండ్రినిగానీ తన తల్లినిగానీ దూషిస్తాడో వాడికి మరణశిక్ష విధించాలి. వాడు తన తండ్రినో తల్లినో దుర్భాషలాడాడు గనక అతడు దోషి, మరణ శిక్షకు పాత్రుడు.
10 వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగు వాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడికి-ఆ వ్యభిచారికి, వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి.
11 తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం కోసం ఆమెతో పండుకున్న వాడు తన తండ్రి గౌరవాన్ని భంగపరిచాడు. వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు తమ శిక్షకు తామే కారకులు.
12 ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు వరసలు తప్పారు. వారు దోషులు. మరణ శిక్షకు పాత్రులు.
13 ఒకడు స్త్రీతో పెట్టుకున్నట్టు పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరూ అసహ్య కార్యం చేశారు గనక వారికి మరణశిక్ష విధించాలి. వారు దోషులు, మరణ శిక్షకు పాత్రులు.
14 ఒకడు స్త్రీని పెళ్ళాడి ఆమె తల్లిని కూడా పెళ్లాడితే అది దుర్మార్గం. అతణ్ణి, ఆ స్త్రీలను సజీవ దహనం చెయ్యాలి. ఆ విధంగా మీ మధ్యనుండి దుర్మార్గత తొలిగిపోతుంది.
15 ఎవరైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుంటే వాడికి తప్పక మరణ శిక్ష విధించాలి. ఆ జంతువును చంపాలి.
16 జంతువుతో ఒక స్త్రీ లైంగికంగా కలవడం కోసం దాని దగ్గరికి పోతే ఆ స్త్రీని ఆ జంతువును చంపాలి. ఆమెకు దానికి తప్పక మరణ శిక్ష పడాలి. వారు దోషులు, మరణ శిక్షకు పాత్రులు.
17 ఒకడు తన సోదరితో, అంటే తన తండ్రి కుమార్తెతో గానీ తన తల్లి కుమార్తెతో గానీ లైంగిక సంబంధం పెట్టుకుంటే అది సిగ్గుచేటు. తమ జాతి వారి సమక్షంలో వారిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి. వాడు తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తన దోష శిక్షను తాను భరించాలి.
18 ఒక స్త్రీ ఋతుస్రావం సమయంలో ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆమె రక్త స్రావాన్ని, రక్తధారను బట్టబయలు చేసాడు. ప్రజల్లో నుండి వారిద్దరినీ లేకుండా చేయాలి.
19 నీ తల్లి సోదరితో గాని నీ తండ్రి సోదరితో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే నీవు నీ దగ్గర బంధువును హీన పరిచావు. నీ దోషశిక్షను భరించాలి.
20 బాబాయి భార్యతో గానీ మేనమామ భార్యతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు తన దగ్గర బంధువును హీనపరిచాడు. వారు తమ పాపశిక్షను భరించాలి. వారు పిల్లలు లేకుండా చనిపోతారు.
21 ఒకడు తన సోదరుని భార్యను పెళ్లాడితే అది అశుద్ధం. ఎందుకంటే వాడు తన సోదరుని వివాహబంధాన్ని మీరాడు. వారు సంతాన హీనులుగా ఉంటారు.
22 కాబట్టి మీరు నివసించాలని నేను ఏ దేశానికి మిమ్మల్ని తీసుకు పోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండేలా మీరు నా శాసనాలన్నిటిని, నా విధులన్నిటిని పాటించాలి.
23 నేను మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్న జాతుల ఆచారాల ప్రకారం నడుచుకోకూడదు. వారు అలాటి క్రియలన్నీ చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.
24 నేను మీతో చెప్పాను. మీరు వారి భూమిని వారసత్వంగా పొందుతారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీరు స్వాధీన పరచుకునేందుకై మీకిస్తాను. జాతుల్లో నుండి మిమ్మల్ని వేరు చేసిన మీ దేవుడైన యెహోవాను నేనే.
25 కాబట్టి మీరు శుద్ధ జంతువులకు, అశుద్ధ జంతువులకు, శుద్ధ పక్షులకు, అశుద్ధ పక్షులకు అంతరం తెలుసుకోవాలి. అశుద్ధమైనదని నేను మీకు వేరు చేసి చెప్పిన ఏ జంతువు మూలంగా గానీ ఏ పక్షి మూలంగా గానీ, నేల మీద పాకే దేని మూలంగా గానీ మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకోకూడదు.
26 మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీరు నావారై ఉండేలా అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరు చేశాను.
27 పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.”