యోనా
గ్రంథకర్త
యోనాగ్రంథ రచయిత యోనా ప్రవక్త అని 1:1 స్పష్టంగా పేర్కొంటున్నది. ఇతడు నజరేతు ప్రాంతంలో గతహెఫెరు ఊరికి చెందినవాడు. తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని గలిలయ అన్నారు (2 రాజులు 14:25). అంటే ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యానికి చెందిన కొద్దిమంది ప్రవక్తల్లో యోనా ఒకడు. యోనా గ్రంథం దేవుని సహనాన్ని, వాత్సల్యాన్ని ఎత్తి చూపుతున్నది. తనకు లోబడే వారికి రెండవ అవకాశం ఇవ్వడానికి ఆయనకున్న సమ్మతిని తెలుపుతున్నది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 785 - 760
కథనం ఇశ్రాయేల్లో మొదలై మధ్యదరా సముద్రం ఓడరేవు యొప్పే నుండి అషురు రాజ్యం ముఖ్యపట్టణం నీనెవెలో ముగుస్తుంది. నీనెవె టైగ్రిస్ నదీ తీరాన ఉంది.
స్వీకర్త
ఇశ్రాయేల్ ప్రజలు, భావికాలంలో బైబిలు చదివేవారు.
ప్రయోజనం
అవిధేయత, ఉజ్జీవం ఇవి రెండు ఈ పుస్తకంలో ముఖ్యాంశాలు. పెద్ద చేప కడుపులో యోనా అనుభవం. అతడు పశ్చాత్తాప పడిన దాని ఫలితంగా అబ్బురమైన విడుదల అతడు పొందడానికి కారణమైంది. మొదట్లో అతని అవిధేయత చివరికి వ్యక్తిగత ఉజ్జీవానికి దారి తీసింది. అంతేగాక నీనెవె రక్షణ కూడా సిద్ధించింది. దేవుని సందేశం ప్రపంచం మొత్తానికి కేవలం మనవంటి, లేక మనతో పోలికలున్న వారికి మాత్రమే కాదు. దేవుని యధార్ధమైన పశ్చాత్తాపం కావాలి. మన హృదయాన్ని, నిజమైన అనుభూతులను ఆయన చూస్తున్నాడు. కేవలం ఇతరుల కోసం మనం చేసే మంచి పనులు కాదు.
ముఖ్యాంశం
మనుషులందరి పట్ల దేవుని కృప.
విభాగాలు
1. యోనా అవిధేయత — 1:1-14
2. యోనాను పెద్ద చేప మింగడం — 1:15, 16
3. యోనా పరితాపం — 1:17-2:10
4. యోనా నీనెవెలో బోధించడం — 3:1-10
5. దేవుని కనికరాన్ని బట్టి యోనా కోపగించుకోవడం — 4:1-11
1
యోనా తర్షీషుకు పారిపోవడం
1 యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు.
2 “నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.”
3 కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు.
4 అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది.
5 అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు.
6 అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.
7 అంతలో నావికులు “ఎవర్ని బట్టి ఇంత కీడు మనకు వచ్చిందో తెలుసుకోడానికి మనం చీట్లు వేద్దాం రండి” అని ఒకరితో ఒకరు చెప్పుకుని, చీట్లు వేశారు. చీటీ యోనా పేరున వచ్చింది.
8 కాబట్టి వాళ్ళు “ఎవరి కారణంగా ఈ కీడు మనకు వచ్చిందో మాకు చెప్పు. నీ ఉద్యోగం ఏంటి? నువ్వెక్కడనుంచి వచ్చావు? నీది ఏ దేశం? ఏ జనం నుంచి వచ్చావు?” అని యోనాని అడిగారు.
9 అతడు వాళ్ళతో ఇలా అన్నాడు. “నేను హెబ్రీయుణ్ణి. సముద్రానికీ భూమికీ సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాణ్ణి.”
10 వాళ్ళు మరింత భయపడి అతనితో “నువ్వు చేసిన పని ఏమిటి?” అన్నారు. ఎందుకంటే తాను యెహోవా సన్నిధినుంచి పారిపోతున్నట్టు అతడు వాళ్లకు చెప్పాడు.
11 అప్పుడు వాళ్ళు యోనాతో “సముద్రం మాకోసం నిమ్మళించేలా మేము నీకేం చెయ్యాలి?” అని అడిగారు. ఎందుకంటే సముద్రం ఇంకా భీకరమౌతూ ఉంది.
12 యోనా “నా కారణంగానే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళిస్తుంది” అని వాళ్లకు జవాబిచ్చాడు.
13 అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్య లేకపోయారు.
14 కాబట్టి వాళ్ళు యెహోవాకు ఇలా మొర్రపెట్టారు. “ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చెయ్యవద్దు. అతని చావుకు మా మీద దోషం మోప వద్దు. ఎందుకంటే యెహోవా, నువ్వే నీ ఇష్టప్రకారం ఇలా జరిగించావు.”
15 ఇలా అని వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది.
16 అప్పుడు వాళ్ళు యెహోవాకు ఎంతో భయపడి, ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్లు చేశారు.
17 ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.