8
జెబహును, సల్మున్నాను
అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో “నువ్వు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని అతనితో తీవ్రంగా వాదించారు. అందుకు అతడు “మీరు చేసినదేమిటీ, నేను చేసినదేమిటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులు ఓరేబు, జెయేబు మీద మీకు జయం ఇచ్చాడు. మీరు చేసినట్టు నేను చెయ్యగలనా?” అన్నాడు అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వాళ్లకు కోపం తగ్గింది.
గిద్యోను, అతనితో ఉన్న మూడువందల మందీ అలసట చెందినప్పటికీ మిద్యానీయుల శత్రువులను తరుముతూ, యొర్దాను దగ్గరికి వచ్చి, దాన్ని దాటారు. అతడు సుక్కోతు వాళ్ళతో “నా వెంట ఉన్న ప్రజలు అలసి ఉన్నారు, మేము మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాము. దయచేసి నాతో వస్తున్నవారికి రొట్టెలు ఇవ్వండి” అని అడిగాడు. సుక్కోతు అధిపతులు “జెబహు, సల్మున్నా అనే వాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?” అన్నారు. అందుకు గిద్యోను “జెబహు సల్మున్నా మీద యెహోవా నాకు జయం ఇచ్చిన తరువాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
అక్కడనుంచి అతడు పెనూయేలుకు వెళ్ళి అలాగే వాళ్ళనూ అడిగినప్పుడు, సుక్కోతు వాళ్ళు జవాబిచ్చినట్టు పెనూయేలువాళ్ళు కూడా అతనికి జవాబిచ్చారు గనుక అతడు, “నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని పెనూయేలు వాళ్ళతో చెప్పాడు. 10 అప్పుడు జెబహు, సల్మున్నా వాళ్ళతో కూడా వాళ్ళ సైన్యాలు, అంటే తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలినవాళ్ళు ఇంచుమించు పదిహేను వేలమంది మాత్రమే, కర్కోరులో ఉన్నారు. లక్షా ఇరవైవేలమంది అప్పటికే చనిపోయారు.
11 అప్పుడు గిద్యోను నోబహుకు, యొగేబ్బెహకు తూర్పున, దేశ సంచారుల మార్గాన శత్రు శిబిరానికి వెళ్ళి, శత్రుసైన్యం నిర్భయంగా ఉన్న కారణంగా ఆ సైన్యాన్ని ఓడించాడు. 12 జెబహు, సల్మున్నా పారిపోయినప్పుడు అతడు వాళ్ళను తరిమి ఇద్దరు మిద్యాను రాజులు జెబహును, సల్మున్నాను పట్టుకుని ఆ సేనంతటిని చెదరగొట్టాడు.
13 యుద్ధం ముగిసిన తరువాత యోవాషు కొడుకు గిద్యోను 14 హెరెసు ఎగువనుంచి తిరిగి వచ్చి, సుక్కోతు వాళ్ళలో ఒక యువకుణ్ణి పట్టుకుని విచారణ చేయగా అతడు సుక్కోతు అధిపతులు, పెద్దల్లో డెబ్భై ఏడుగురి పేర్లు వివరంగా చెప్పాడు. 15 అప్పుడతడు సుక్కోతు వాళ్ళ దగ్గరికి వచ్చి “ ‘జెబహు, సల్మున్నా అనేవాళ్ళను నువ్వు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేము రొట్టెలు ఎందుకివ్వాలి?’ అని మీరు ఎవరి విషయంలో నన్ను దూషించారో, ఆ జెబహును, సల్మున్నాలను, చూడండి” అని చెప్పి 16 ఆ ఊరిపెద్దలను పట్టుకుని, ముళ్ళకంపను, బొమ్మజెముడును తీసుకు వాటితో సుక్కోతు వాళ్ళకు బుద్ధి చెప్పాడు. 17 అతడు పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివాళ్ళను చంపాడు.
18 గిద్యోను, మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎలాంటి వారని జెబహును సల్మున్నాను అడిగినప్పుడు వాళ్ళు “నీలాంటివాళ్ళే. వాళ్ళందరూ రాకుమారుల్లా ఉన్నారు” అన్నారు. 19 గిద్యోను “వాళ్ళు నా తల్లి కుమారులు. నా సహోదరులు. మీరు వాళ్ళను బ్రతకనిచ్చి ఉంటే 20 యెహోవా జీవం తోడు, మిమ్మల్ని చంపేవాణ్ణి కాదు” అని చెప్పి, తన పెద్ద కొడుకు యెతెరును చూసి “నువ్వు లేచి వాళ్ళని చంపు” అన్నాడు. అతడు పసి వాడు గనుక భయపడి కత్తిని దూయలేదు. 21 అప్పుడు జెబహు సల్మున్నాలు “వయస్సునుబట్టి మనిషికి శక్తి ఉంటుంది గనుక, నువ్వే లేచి, మమ్మల్ని చంపు” అన్నారు. గిద్యోను లేచి జెబహును, సల్మున్నాను చంపి, వాళ్ళ ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
గిద్యోను ఏఫోదు
22 అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో “నువ్వు మిద్యానీయుల చేతిలోనుంచి మమ్మల్ని రక్షించావు గనుక నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, మమ్మల్ని పరిపాలించండి” అని చెప్పారు. 23 అందుకు గిద్యోను “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించకూడదు. యెహోవా మిమ్మల్ని పరిపాలిస్తాదు” అని చెప్పాడు.
24 గిద్యోను “మీలో ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న చెవి పోగులను నాకు ఇవ్వండి అని మనవి చేస్తున్నాను” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు గనుక వాళ్ళ చెవులకు పోగులు ఉన్నాయి.) 25 అందుకు ఇశ్రాయేలీయులు “సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాము” అని చెప్పి ఒక బట్ట పరచి, ప్రతివాడూ తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దాని మీద వేశాడు. 26 మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణాలు, ధూమ్రవర్ణపు దుస్తులు, ఒంటెల మెడల మీద ఉన్న గొలుసుల తూకం కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల తులాల బంగారం అయ్యింది. గిద్యోను దానితో ఒక ఏఫోదును* చేయించి తన సొంత ఊరు ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. 27 కాబట్టి ఇశ్రాయేలీయులంతా ద్రోహులై అక్కడికి వెళ్ళి దానికి మొక్కి వ్యభిచారులయ్యారు. అది గిద్యోనుకు, అతని ఇంటివాళ్ళకు ఒక ఉచ్చుగా అయ్యింది.
గిద్యోనుమరణం
28 ఇశ్రాయేలీయులు మిద్యానీయులను అణచి వేసిన తరువాత, ఇంక వాళ్ళు తలెత్త లేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. 29 తరువాత యోవాషు కొడుకు యెరుబ్బయలు, తన సొంత ఇంట్లో నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడు. 30 గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్న కారణంగా అతని కడుపున పుట్టినవాళ్ళు డెబ్భై మంది కొడుకులు ఉన్నారు. 31 షెకెములో ఉన్న అతని ఉపపత్ని కూడా అతనికి ఒక కొడుకును కన్నప్పుడు గిద్యోను అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు.
32 యోవాషు కొడుకు గిద్యోను ముసలివాడై చనిపోయాడు. అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న అతని తండ్రి యోవాషు సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. 33 గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు తమ శత్రువుల చేతిలోనుంచి తమను విడిపించిన యెహోవా దేవుణ్ణి ఘనపరచక, ఆయన్ని జ్ఞాపకం చేసుకోక, 34 మళ్ళీ బయలుదేవుళ్ళను అనుసరించి, వ్యభిచారులై, బయల్బెరీతును తమకు దేవుడుగా చేసుకున్నారు. 35 వాళ్ళు యెరుబ్బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతా మరచిపోయి, అతని యింటివాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారం, ఉపకారం చెయ్యలేదు.
* 8:26 ఏఫోదును దేవుని సేవించటానికి ప్రధాన యాజకులు వాడే పై వస్త్రం. 8:29 యెరుబ్బయలు గిద్యోను 8:34 బయల్బెరీతును బయలుతో ఒప్పందం