17
1 నా ప్రాణం సొమ్మసిల్లిపోయింది. నేను బ్రతికే రోజులు ముగిసిపోయాయి. నాకోసం సమాధి సిద్ధంగా ఉంది.
2 ఎగతాళి చేసేవాళ్ళు నా చుట్టూ చేరారు. నా సమక్షంలోనే వాళ్ళు వివాదాలు రేకెత్తిస్తున్నారు.
3 దేవా, దయచేసి నువ్వే నాకు పూచీకత్తు ఉంటానని మాట ఇవ్వు. నువ్వు కాక ఇంకెవరు నాకు జామీనుగా ఉంటారు.
4 నువ్వు వాళ్ళ హృదయాలను మూసివేసి జ్ఞానహీనులుగా చేశావు. కనుక వాళ్ళు ఎలాంటి ఘనతా పొందరు.
5 దోపిడీ సొమ్ము కోసం తన స్నేహితులను నిందించేవాడి పిల్లల కళ్ళు మసకబారతాయి.
6 ఆయన నన్ను మనుషులందరికీ ఒక సామెతలాగా నిలబెట్టాడు. నలుగురూ నా ముఖం మీద ఉమ్మివేస్తారు.
7 అధికమైన శోకం వల్ల నా కంటి చూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలాగా మారిపోయాయి.
8 యథార్థవంతులు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. నిజాయితీపరులు భక్తిహీనుల స్థితిని చూసి కలవరం చెందుతారు.
9 అయితే నీతిమంతులు తమ మార్గాన్ని విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగుతారు. నిరపరాధులు అంతకంతకూ వృద్ది చెందుతారు.
10 అప్పుడు మీరంతా మరోసారి నా దగ్గరికి రండి, మీలో ఒక్క జ్ఞాని కూడా నాకు కనిపించడు.
11 నా రోజులు ముగిసిపోయాయి. నా తలంపులు వ్యర్ధమైపోయాయి. నా హృదయంలోని కోరికలు భగ్నం అయ్యాయి.
12 రాత్రి సమయాన్ని పగలు అనీ, చీకటి కమ్మినప్పుడు అది వెలుగు అనీ వాళ్ళు వాదిస్తారు.
13 నాకు ఆశ ఏదైనా ఉన్నట్టయితే అది మృత్యులోకం నాకు ఇల్లు కావాలని. చీకటిలో నా పడక సిద్ధం చేసుకోవాలని.
14 గొయ్యిని చూసి ‘నువ్వే నాకు తండ్రివి’ అనీ, పురుగును చూసి ‘నువ్వే నాకు తల్లివి, చెల్లివి’ అనీ వాటితో చెప్పాలని ఉంది.
15 అలాంటప్పుడు నాకు నిరీక్షణకు ఆధారం ఏమిటి? దాన్ని ఎవరు కనుగొనగలరు?
16 అది నాతోబాటు మృత్యులోకం అడ్డకమ్ముల దగ్గరికి దిగిపోతుందా? నాతో కలసి మట్టిలో కలసిపోతుందా?”