తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక రచయితగా పౌలు రెండు సార్లు తనను చెప్పుకున్నాడు (1:1-2:18). పౌలు రెండవ సువార్త యాత్రలో ఈ సంఘం ఏర్పడినప్పుడు (అపో. కా. 17:1-9) అతనితో కలిసి ప్రయాణించిన సీల, తిమోతి (3:2, 6) కూడా ఈ పత్రిక రాయడంలో ఉన్నారు. అక్కడినుంచి వెళ్ళిపోయిన కొద్ది నెలలకే పౌలు తన మొదటి పత్రిక రాశాడు. ఇక్కడ పౌలు పరిచర్య కేవలం యూదులకే గాక యూదేతరులకు కూడా వ్యాపించింది. సంఘంలో అనేకమంది యూదేతరులు విగ్రహ పూజను వదిలిపెట్టారు. ఇది ఆనాటి యూదులకు పెద్ద సమస్య కాదు (1:9).
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 50 - 52
కొరింతి పట్టణంలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడు.
స్వీకర్త
1:1 పకారం తెస్సలోనిక సంఘ సభుల కోసం పౌలు ఇది రాశాడు. అయినప్పటికీ అంతటా ఉన్న క్రైస్తవులందరికీ ఇది ఉపయుక్తం.
ప్రయోజనం
నూతన విశ్వాసులు తమ బాధల్లో ప్రోత్సాహం పొందడం పౌలు ఉద్దేశం (3:3-5). భక్తి జీవితానికి అవసరమైన సూచనలు ఇందులో ఉన్నాయి (4:1-12). అంతేకాదు, క్రీస్తు రాకకు ముందే చనిపోయిన వారి భవితవ్యం గురించిన నిశ్చయత ఇవ్వడం కూడా (4:13-18). ఇంకా కొన్ని నైతిక ఆచరణాత్మక అంశాల గురించిన వివరణ పౌలు ఇచ్చాడు.
ముఖ్యాంశం
సంఘం గురించిన శ్రద్ధ.
విభాగాలు
1. కృతజ్ఞతలు — 1:1-10
2. అపోస్తలిక చర్యల గురించి సంజాయిషీ — 2:1-3:13
3. తెస్సలోనికయులకు హెచ్చరికలు — 4:1-5:22
4. ముగింపు ప్రార్థన, ఆశీర్వచనం — 5:23-28
1
ఆదర్శ సంఘం. క్రైస్తవ జీవితం
1 తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తులోనూ ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగు గాక!
2 మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం.
3 విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
4 దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
5 ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.
6 మీరు మమ్మల్నీ, ప్రభువునీ అనుకరించారు. అనేక తీవ్ర హింసలు కలిగినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు.
7 కాబట్టి మాసిదోనియలో, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శప్రాయులయ్యారు.
8 మీ దగ్గర నుండే ప్రభువు వాక్కు మాసిదోనియలో అకయలో వినిపించింది. అంతమాత్రమే కాకుండా ప్రతి స్థలంలో దేవుని పట్ల మీకున్న విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
9 అక్కడి వారు మా విషయమై మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో,
10 పరలోకం నుండి వస్తున్న ఆయన కుమారుని కోసం ఎలా వేచి ఉన్నారో చెబుతున్నారు. ఈ యేసును దేవుడు చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడు. ఈయన రానున్న ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్నాడు.