25
అబ్రాహాము ఇతర సంతతి
1దిన 1:32-33
1 అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.
2 ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.
3 యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.
4 మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.
5 వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు.
6 అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు.
అబ్రాహాము మరణం, సమాధి
7 అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
8 అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు.
9 అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.
10 అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు.
11 అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు.
ఇష్మా యేలు వంశావళి
12 ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది.
13 ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ,
14 మిష్మా, దూమానమశ్శా,
15 హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా.
16 ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు.
17 ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
18 వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకూ నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు విరోధంగా జీవించేవారు.
19 అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి.
20 ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు.
ఏశావు, యాకోబుల జననం
21 ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.
22 ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.
23 అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు.
“రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి.
రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి.
ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది.
పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.”
24 ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
25 మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు.
26 తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
ఏశావు తన జేష్టత్వం హక్కు వదులుకోవడం
27 ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.
28 ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.
29 యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.
30 ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది.
31 అందుకు యాకోబు “ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి” అన్నాడు.
32 అప్పుడు ఏశావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు.
33 యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.
34 యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.