5
మోషే అహరోనులు ఫరో ఎదుట
1 ఈ విషయాలు జరిగిన తరువాత మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి “ఇశ్రాయేలు ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు: ఎడారిలో నా కోసం ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు” అని చెప్పారు.
2 అందుకు ఫరో “యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు. ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను” అన్నాడు.
3 అప్పుడు ఆ ఇద్దరూ “హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు. మాకు అనుమతి ఇస్తే మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి మా దేవుడు యెహోవాకు బలి అర్పిస్తాం, లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు, ఖడ్గానికి గురి చేస్తాడేమో” అన్నారు.
4 ఐగుప్తు రాజు “మోషే, అహరోనూ, ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డు పడుతున్నారేమిటి? పోయి మీ పనులు చూసుకోండి.
5 మా దేశంలో హెబ్రీయుల జనాభా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళంతా తమ పనులు మానుకునేలా మీరు చేస్తున్నారు” అని వాళ్ళతో అన్నాడు.
6 ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు, వారి పైఅధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు.
7 “ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇకనుండి మీరు ఇవ్వకండి. వాళ్ళే వెళ్లి కావలసిన గడ్డి తెచ్చుకోవాలి.
8 అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకు ముందు చేసినట్టుగానే ఇటుకల పని చెయ్యాలి. వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు. అందుకే వారు ‘మేము వెళ్లి మా దేవునికి బలులు అర్పించడానికి అనుమతి ఇవ్వండి’ అని కేకలు వేస్తున్నారు.
9 అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి. అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పని చేసుకుంటారు” అన్నాడు.
10 కాబట్టి పర్యవేక్షకులు, పై అధికారులు వెళ్లి ప్రజలతో “మేము మీకు గడ్డి ఇయ్యము.
11 మీరే వెళ్లి గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతికి సంపాదించుకోండి. అయితే మీ పని ఏమాత్రం తగ్గించము అని ఫరో సెలవిచ్చాడు” అన్నారు.
12 అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ పుల్లలు సమకూర్చుకోవడానికి ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయారు.
13 అంతేకాదు, ఆ పర్యవేక్షకులు వాళ్ళను ఒత్తిడి చేస్తూ “గడ్డి ఇస్తున్నప్పటి లాగానే ఏ రోజు పని ఆ రోజు లెక్క ప్రకారం పూర్తి చేయాలి” అని బలవంతపెట్టారు.
14 ఫరో ఆస్థాన అధికారులు తాము ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇశ్రాయేల్ నాయకులను కొట్టారు. “ఇది వరకూ లాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న, ఈ రోజు ఎందుకు చేయించ లేదు?” అని అడిగారు.
15 ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు ఫరో దగ్గరికి వచ్చారు. “తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు?
16 తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు. అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే” అని మొర పెట్టుకున్నారు.
17 అప్పుడు ఫరో “మీరు సోమరిపోతులు, వట్టి సోమరిపోతులు. అందుకే ‘మేము వెళ్లి యెహోవాకు బలులు అర్పించాలి’ అని అనుమతి అడుగుతున్నారు.
18 మీరు వెళ్లి పని చెయ్యండి. మీకు గడ్డి ఇవ్వడం జరగదు. మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్పగించక తప్పదు.
19 మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు, ఏ రోజు పని ఆ రోజే ముగించాలి” అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకు పోయామని గ్రహించారు.
20 వాళ్ళు ఫరో దగ్గర నుండి తిరిగి వస్తూ, వారిని కలుసుకోవడానికి దారిలో ఎదురు చూస్తున్న మోషే, అహరోనులను కలుసుకున్నారు.
21 వాళ్ళు “యెహోవా మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడు గాక. ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి, మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళయ్యారు” అన్నారు.
22 మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్లి “ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు?
23 నేను నీ ప్రతినిధిగా మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు. నువ్వు నీ ప్రజలను విడిపించడానికి నీవు ఏమీ చేయలేదు” అన్నాడు.