5
ప్రమాణాల వ్యర్ధత
1 నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము చేసే పనులు దుర్మార్గమైనవని తెలుసుకోకుండా బుద్ధిహీనుల్లాగా బలులు అర్పించడం కంటే దానికి దగ్గరగా వెళ్లి మాటలు వినడం మంచిది.
2 దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో.
దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు,
కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.
3 విస్తారమైన పనులు, చింతల వలన చెడ్డ కలలు వస్తాయి.
ఎక్కువ మాటలు పలికేవాడు ఎక్కువ మూర్ఖంగా పలుకుతాడు.
4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు.
5 నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు. మొక్కుకుని చెల్లించకపోవడం కంటే అసలు మొక్కుకోకపోవడం మంచిది.
6 నీ శరీరం పాపంలో పడేలా చేసేటంతగా నీ నోటిని మాట్లాడనీయకు. “ఆ మొక్కుబడి పొరపాటుగా చేశాను” అని యాజకునితో చెప్పవద్దు. నీ మాటలతో దేవునికి కోపం తెప్పించి ఎందుకు నష్టపోతావు?
7 ఎక్కువ కలలతో, మాటలతో ప్రయోజనం లేదు. నీ వరకూ నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండు.
సంపదులు వ్యర్థం
8 ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు.
9 ఏ దేశంలో రాజు భూమి గురించి శ్రద్ధ వహిస్తాడో ఆ దేశానికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది.
10 డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు.
ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు.
ఇది కూడా నిష్ప్రయోజనమే.
11 ఆస్తి ఎక్కువైతే దాన్ని దోచుకునే వారు కూడా ఎక్కువవుతారు.
కేవలం కళ్ళతో చూడడం తప్ప ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏముంది?
12 కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు.
అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు.
13 సూర్యుని కింద మనస్సుకు బాధ కలిగించేది ఒకటి చూశాను.
అదేమంటే ఆస్తిపరుడు తన ఆస్తిని దాచుకోవడం అతనికే నష్టం తెచ్చిపెడుతుంది.
14 అతడు దురదృష్టవశాత్తూ తన ఆస్తిని పోగొట్టుకుంటే అతని కొడుకు చేతిలో ఏమీ లేనివాడు అవుతాడు.
15 వాడు ఏ విధంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ విధంగానే, దిగంబరిగా వెళ్ళిపోతాడు.
తాను పని చేసి సంపాదించినా దేనినీ చేతపట్టుకుని పోలేడు.
16 ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడం వలన లాభమేమిటి?
17 ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు.
అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు.
18 నేను చూసిన దానిలో కోరదగినది, మంచిది ఏంటంటే, ఒకడు దేవుడు తనకు నియమించిన జీవితమంతా తన కష్టార్జితంతో అన్నపానాలు తీసుకుంటూ, క్షేమంగా బతకడమే. అదే దేవుడు వాడికి నియమించింది.
19 అంతే గాక దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానిలో తన వంతు అనుభవించడానికి, అన్నపానాలు పుచ్చుకోడానికి, తన కష్టార్జితంలో సంతోషించడానికి వీలు కలిగిస్తే అది దేవుని దీవెన అని భావించాలి.
20 అతడు చేసే పనిలో దేవుడు అతనికి సంతోషం కలిగిస్తాడు కాబట్టి అతడు తన జీవితంలోని రోజులను పదే పదే జ్ఞాపకం చేసుకోడు.