5
చుట్టబడిన ఎగిరే పత్రం
1 నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను.
2 “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగినాడు.
“నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.
3 అప్పుడు దేవదూత నాతో చప్పాడు, “ఆ చుట్ట బడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. ఆ పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసే వారికి ఒక శాపం ఉంది.
4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘దొంగల ఇండ్లకు, నా పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు ఆ చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. ఆ పత్రం అక్కడ వుండి, ఆ ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.’ ”
స్త్రీ మరియు తొట్టె
5 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూత బయటికి వెళ్లాడు. అతడు నాతో, “చూడు!నీవు ఏమి జరుగుతున్నట్లు చూస్తున్నావు?” అని అన్నాడు.
6 “అదేమిటో నాకు తెలియదు” అని నేను అన్నాను.
అతడు ఇలా చెప్పాడు: “అది ఒక కొలతొట్టె. ఈ దేశంలో ప్రజలు చేసే పాపాలను కొలవటానికి ఆ బుట్ట ఉద్దేశించబడింది.”
7 ఆ తొట్టె మీదనుంచి సీసపు మూత తొలగించ బడింది. ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో బరువైన (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి ఉంది.
8 “ఈ స్త్రీ చెడును ెతెలియజేస్తుంది” అని దేవ దూత చెప్పాడు. పిమ్మట దేవదూత ఆ స్త్రీని తొట్టెలో పడదోసి, దానిమీద సీసపు మూతను పెట్టాడు. పాపాలు ఘోరమైనవని (బరువై నవని) ఇది తెలుపుతుంది.
9 తరువాత నేను పైకి చూశాను. అక్కడ సంకుబుడ్డ కొంగవలె రెక్కలు గల ఇద్దరు స్త్రీలను చూశాను. వారు ఎగిరి వచ్చారు. వారి రెక్కల్లో గాలి ఉంది. వారు బుట్టను పట్టి లేవనెత్తాకు. బుట్టను పట్టుకొని వారు గాలిలోకి పోయారు.
10 “వారు ఆ బుట్టను ఎక్కడికి మోసుకు పోతున్నారు?” అని నాతో మాట్లాడుతూ వున్న దేవ దూతను నేనడిగాను.
11 దేవదూత నాతో ఇలా చెప్పాడు: “షీనారులో దానికొక ఆలయం నిర్మించటానికి వారు వెళ్తున్నారు. వారా ఆలయాన్ని నిర్మించాక ఆ బుట్టను అక్కడ ఉంచుతారు.”