62
సంగీత నాయకునికి. యెదూతూను రాగం. దావీదు కీర్తన. 
 
1 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.   
2 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.  
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.   
   
 
3 ఇంకెంత కాలం నా మీద దాడి చేస్తూ ఉంటావు.  
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను.  
పడిపోతున్న కంచెలా ఉన్నాను.   
4 ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి  
పథకాలు వేస్తున్నారు.  
వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు.  
బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబతారు,  
కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.   
   
 
5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.  
దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.   
6 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.  
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.   
7 నా మహిమా విజయం దేవుని నుండి వస్తుంది.  
ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం   
8 ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.  
మీ సమస్యలు దేవునితో చెప్పండి.  
దేవుడే మన క్షేమ స్థానం.   
   
 
9 మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.  
నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.  
వారు గాలిబడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.   
10 బలవంతంగా విషయాలను చేజిక్కించు కొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.  
దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలచవద్దు.  
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం  
ధనాన్ని నమ్ముకొన వద్దు.   
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబతున్నాడు,  
“బలము దేవుని నుండే వస్తుంది.”   
   
 
12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.  
ఒకడు చేసిన వాటిని బట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.