50
ఆసాపు కీర్తనలలో ఒకటి. 
 
1 దేవాది దేవుడు యెహోవా మాట్లాడాడు.  
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.   
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.   
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.  
ఆయన యెదుట అగ్ని మండుతుంది.  
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.   
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,  
కింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.   
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.  
వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని చెప్పారు.   
   
 
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.  
ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.   
   
 
7 దేవుడు చెబతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.  
ఇశ్రాయేలు ప్రజలారా మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.  
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.   
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.  
ఇశ్రాయేలు ప్రజలారా మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.   
9 మీ ఇంటినుండి యెద్దులను తీసుకోను.  
మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.   
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.  
వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.   
11 కొండల్లో వుండే ప్రతి పక్షి నాకు తెలుసు.  
పొలాల్లో చలించే ప్రతీదీ నా సొంతం   
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు  
ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.   
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను.”   
   
 
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,  
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.   
15 “ఇశ్రాయేలు ప్రజలారా మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!  
నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”   
   
 
16 దుర్మార్గులతో దేవుడు చెబతున్నాడు,  
“నా న్యాయ విధులను చదువుటకు  
నా ఒడంబడికకు బద్దులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?   
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.  
నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.   
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడుతారు.  
వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.   
19 మీరు చెడు సంగతులు చెబతారు, అబద్ధాలు పలుకుతారు.   
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబతారు.  
మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.   
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను  
నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.  
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.  
మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.   
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,  
దేవుని మరచిన జనాంగమైన మీరు,  
ఈ విషయంను గూర్చి ఆలోంచించాలి.  
అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.   
23 ఒక వ్యక్తి కృతజ్ఞతా అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.  
నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”