16
దావీదుకు అభిమాన కావ్యము. 
 
1 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.   
2 “యెహోవా, నీవు నా యజమానివి  
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభీస్తుంది”  
అని నేను యోహోవాతో చెప్పాను.   
3 దేశములో పవిత్రమైనవి అని పిలుపబడే విగ్రహములకు  
సంబంధించిన వాటియందు ఆనందించు వారందరు శాపగ్రస్తులగుదురు గాక!   
   
 
4 కానీ ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.  
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.  
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.   
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.  
యెహోవా, నీవే నన్ను బలపరచావు.  
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.   
6 నా వంతు చాలా అద్భుతమయింది.  
నా స్వాస్థ్యము చాలా అందమయింది.   
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.  
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.   
   
 
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.  
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.  
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.   
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.  
నా శరీరం కూడ క్షేమంగా బతుకుతుంది.   
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.  
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.   
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.  
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.  
నీ కుడిపక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.