7
1 మరునాడు ఉదయాన్నే యెరుబ్బయలు, (గిద్యోను) మరియు అతని మనుష్యులందరూ హరోదు బావి దగ్గర దిగారు. మోరె కొండ దిగువన ఉన్న లోయలో మిద్యాను ప్రజలు బసచేసారు. ఇది గిద్యోనుకు, అతని మనుష్యులకు ఉత్తరాన ఉంది.
2 అప్పుడు యెహోవా, “మిద్యాను ప్రజలను ఓడించేందుకు నేను నీ మనుష్యులకు సహాయం చేయబోతున్నాను. కాని ఆ పని కోసం నీ దగ్గర ఉన్న మనుష్యులు చాలా ఎక్కువ మంది. ఇశ్రాయేలు ప్రజలు వారిని వారే రక్షించుకొన్నారని అతిశయించి నన్ను మరచిపోవటం నాకు ఇష్టం లేదు.
3 కనుక ఇప్పుడు నీ మనుష్యులకు ఒక ప్రకటన చెయ్యి. ‘భయపడేవారు ఎవరైనా సరే గిలాదు కొండ విడిచి పోవచ్చును. అలాంటి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోవచ్చును’ అని వారితో చెప్పుము” అని గిద్యోనుతో అన్నాడు.
ఆ సమయంలో ఇరవైరెండు వేల మంది గిద్యోనును విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంకా పదివేల మంది మనుష్యులు మిగిలిపోయారు.
4 “ఇంకా చాలా మంది మనుష్యులున్నారు. ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి తీసుకుని వెళ్లు, అక్కడ నేను నీ కోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెబితే అతడు వెళతాడు. కాని నేను, ‘అతడు నీతో వెళ్లడు’ అని అంటే ఆ మనుష్యుడు వెళ్లకూడదు” అని గిద్యోనుతో యెహోవా చెప్పాడు.
5 కనుక గిద్యోను ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి నడిపించాడు. ఆ నీళ్ల దగ్గర గిద్యోనుతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులను ఈ విధంగా వేరు చెయ్యి. కుక్క గతికినట్లు గతుకుచూ నీళ్లు తాగే వారంతా ఒక గుంపు. మరియు మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగే మనుష్యులంతా మరో గుంపుగా చేయబడాలి.”
6 నోటి దగ్గరకు నీళ్లు తెచ్చేందుకు తమ చేతులనుపయోగించి కుక్క గతికినట్లు గతికిన వారు మూడు వందల మంది. మిగిలిన వాళ్లంతా మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగారు.
7 యెహోవా గిద్యోనుతో, “కుక్కలా గతికి నీళ్లు తాగిన మూడువందల మందిని నేను వాడుకొంటాను. మిమ్మల్ని రక్షించేందుకు ఆ మనుష్యులను నేను వాడుకొంటాను. మరియు మిద్యాను ప్రజలను ఓడించేట్లుగా నేను చేస్తాను. మిగిలిన మనుష్యులను వారి ఇళ్లకు వెళ్లిపోనియ్యి” అని చెప్పాడు.
8 కనుక మిగిలిన ఇశ్రాయేలు మనుష్యులను గిద్యోను వారి ఇళ్లకు పంపి వేసాడు. గిద్యోను ఆ మూడు వందల మంది మనుష్యులను తన వెంట ఉంచుకొన్నాడు. ఇళ్లకు వెళ్లిపోయిన వారి బూరలను, ఆహార పదార్థాలను ఆ మూడు వందల మంది ఉంచుకొన్నారు.
గిద్యోను పాళెమునకు క్రింద లోయలో మిద్యానీయుల పాళెము ఉండెను.
9 రాత్రివేళ గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. అతనితో యెహోవా ఇలా చెప్పాడు: “లెమ్ము, మిద్యాను సైన్యాన్ని నీవు ఓడించేటట్టు నేను చేస్తాను. వారి పాళెము వద్దకు దిగి వెళ్లు.
10 ఒంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు.
11 మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. ఆ మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. ఆ తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.”
కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు.
12 మిద్యాను ప్రజలు, అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ ఆ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మనుష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ఆ ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది.
13 గిద్యోను శత్రువుల విడిది దగ్గరకు వచ్చి, అక్కడ ఒక మనిషి మాట్లాడటం విన్నాడు. అతడు తాను చూచిన ఒక కలను గూర్చి తన స్నేహితునితో చెప్పుతున్నాడు, “ఒక గుండ్రని రొట్టె దొర్లుకుంటూ మిద్యాను ప్రజల విడిదిలోకి వచ్చింది. ఆ రొట్టె గుడారాన్ని బలంగా గుద్దుకోవటం చేత ఆ గుడారం తలక్రిందులై నేల మట్టంగా పడిపోయింది” అని ఆ మనిషి చెబుతూ ఉన్నాడు.
14 ఆ మనిషి స్నేహితునికి అతని కల భావం తెలుసు. “నీ కలకు ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇశ్రాయేలు వాడగు ఆ మనిషిని గూర్చినదే నీ కల. అది యోవాషు కుమారుడు గిద్యోను గూర్చినది. మిద్యాను సైన్యం అంతటినీ ఓడించేందుకు గిద్యోనుకు దేవుడు సహాయం చేస్తాడని దాని భావం” అని ఆ మనిషి స్నేహితుడు చెప్పాడు.
15 ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ పిలిచి, “లేవండి! మిద్యాను ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు.
16 అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది.
17 అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా నేను చేసినట్టే చేయండి.
18 మీరు శత్రువు విడిదిని చుట్టుముట్టండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!’ ”
19 కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది శత్రువులు విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు వారి బూరలు ఊది, వారి కుండలు పగులగొట్టారు.
20 అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టుకొన్నారు. ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, “యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” అని కేకలు వేసారు.
21 గిద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిలబడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు.
22 గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు.
23 అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనష్షే వంశాల నుండి వచ్చిన సైనికులు మిద్యాను ప్రజలను తరమవలసిందిగా ఆజ్ఞాపించబడ్డారు.
24 ఎఫ్రాయిము కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపించాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. వీరిని బేత్బారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, యోర్దాను నదిని స్వధీనం చేసుకోండి. మిద్యాను ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” అని వార్తాహరులు చెప్పారు.
కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ వారు పిలచారు. బేత్బారా వరకు వారు నదిని స్వాధీనం చేసుకున్నారు.
25 మిద్యాను నాయకులు ఇద్దరిని ఎఫ్రాయిము మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు ఓరేబు, జెయేబు, ఓరేబు బండ అనుచోట ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. జెయేబు ద్రాక్షగానుగ అనుచోట వారు జెయేబును చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రజలు యోర్దాను నదిని దాటేచోట గిద్యోను ఉన్నాడు.