38
హిజ్కియా జబ్బు 
 
1 ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త అతన్ని చూడటానికి వెళ్లాడు. “నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా నాకు చెప్పాడు. ‘త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు’ అని యెషయా రాజుతో చెప్పాడు.”   
2 హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు,  
3 “యెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మకమైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం మొదలు బెట్టాడు.   
4 యెహోవా దగ్గర్నుండి యెషయా ఈ సందేశాన్ని స్వీకరించాడు;  
5 “హిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు దేవుడు, యెహోవా చెప్పే సంగతులు ఇవి, ‘నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను.  
6 అష్షూరు రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను.’ ”   
7 యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు చూపించేందుకు యిదే సంకేతం.  
8 “చూడు, ఆహాజు మెట్ల మీద ఉన్న నీడను పది అడుగులు వెనుకకు వెళ్లేటట్టు నేను చేస్తున్నాను. దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు వెళ్తుంది.”   
9 హిజ్కియా రోగమునుండి స్వస్థత పొంది నప్పుడు వ్రాసిన ఉత్తరం:   
   
 
10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బతుకుతానని నాలో నేను అనుకొన్నాను.  
కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.   
11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.  
భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరలచూడను.   
12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారంలాగి వేయబడి నానుండి తీసివేయబడుతుంది.  
మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.  
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.   
13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.  
అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ దొక్కబడ్డాయి.  
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.   
14 నేను గువ్వలా మూల్గాను.  
నేను పక్షిలా ఏడ్చాను.  
నా కళ్లు క్షిణించాయి  
కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.  
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.  
నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”   
15 నేనేం చెప్పగలను?  
జరిగేదేమిటో నా ప్రభువా నాకు చెప్పాడు.  
నా యజమాని దానిని జరిగిస్తాడు.  
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.  
కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.   
16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు  
నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.  
నేను బాగుపడేందుకు సహాయం చేయి.  
మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.   
   
 
17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.  
ఇప్పుడు నాకు శాంతి ఉంది.  
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.  
నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.  
నీవు నా పాపాలన్నీ క్షమించావు.  
నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.   
18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.  
పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.  
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.   
19 నేడు నాలాగే బతికి ఉన్న మనుష్యులే  
నిన్ను స్తుతించేవారు.  
నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.   
20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు  
కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”   
21  అప్పుడు యెషయా, “నీవు అంజూరపు పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు.   
22 కానీ హిజ్కియా, “నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా మందిరానికి వెళ్ల గలుగుతానని రుజువుచేసే సంకేతం ఏమిటి?” అని యెషయాను అడిగాడు.