3
బంగారు విగ్రహం-అగ్నిగుండం
1 నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను రాజ్యంలో దూరాయను మైదాన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించాడు.
2 ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధి కారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు వారందరిని పిలించాడు.
3 రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు.
4 రాజు తరఫున ప్రకటనలు చేసే వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాలనుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ నా మాడలు ఆలకించండి. ఇది మీరు చేయాలని రాజాజ్ఞ.
5 కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల, ధ్వసులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగ పడి పూజించాలి.
6 ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.”
7 అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్టించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.
8 తర్వాత కల్దీయులలో కొందరు రాజు వద్దకు వచ్చి యూదులకు విరుద్ధంగా మాటలాడసాగిరి.
9 వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు, ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక!
10 రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫొనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీక వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు.
11 ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు.
12 రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిషించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.”
13 నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు.
14 అందువల్ల వారిని అతని సమక్షమునకు తీసుకు వచ్చారు. నెబుకద్నెగో, “మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా?
15 కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించ కపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”
16 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు.
17 మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకి ఇష్టం కలిగితే మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు.
18 దేవుడు కూడా మమ్ములను రక్షించని పక్షంలో, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”
19 అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కొపంగా చూశాడు. మామూలుకంటె ఏడు రెట్లు కొలిమి వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు.
20 తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నె గోలనిబంధించి. వేడి కొలిమిలోకి తోసి వేయుమని ఆజ్ఞా పించాడు.
21 అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి త్రోసివేశారు. వాళ్లను మంటలో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు.
22 రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్లవారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహా బలవంతులయిన సైనికుల్ని కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలిచచ్చారు.
23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటల్లోకి త్రోసేశారు.
24 తర్వాత నెబుకద్నెజరు జరిగింది చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాము గదా!” అని అడిగాడు.
“చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు.
25 “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగా గాని కాలి పోయినట్టుగా గాని లేదు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు.
26 తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా బయటికి రండి” అని పిలిచాడు.
అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు.
27 వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు ఉన్నతాధికారులు, రాజుగారి సలహా దారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల వాసనై నా లేదని వారు తెలుసుకొన్నారు.
28 తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటలనుండి రక్షించినాడు. ఈ వ్యక్తులు ముగ్గురు తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొలవడానికి గాని, పూజించుటకు గాని ఇష్టపడలేదు.
29 అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందినవారు గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బగా నాశానం చేయబడుతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడు గాని తన మనుష్యులను రక్షించలేడు.”
30 ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు.